Saturday, 6 February 2016

కలలో...

యాడనున్నావో... 

     ఓర చూపుతో...బుంగమూతితో...
     మల్లె తీగవోలె నన్ను అల్లుకొని ఉక్కిరిబిక్కిరి చేసి ....
     నీ మల్లెల గుబాళింపుతో నాకు ప్రాణవాయువుని అందించే నువ్వు... 
యాడనున్నావో...ఏం చేస్తున్నావో... 
     నా వెంట నడిచి...నా గమనాన్ని గమనించి...
     తప్పటడుగులను సరిదిద్ది,కష్టాలని సుఖాలుగానూ,కన్నీళ్ళను పన్నీరుగా మార్చి
      మన జీవితాలలో సుగంధపరిమళాలు వెదజల్లే నువ్వు....
యాడనున్నావో...ఏం చేస్తున్నావో... 
     బుడి బుడి అడుగులతో...ముద్దు ముద్దు మాటలతో
     కాలాన్ని కరిగించి,బాధ్యతను పెంచే ఓ బహుమతిని బుడతడి రూపంలో ఇచ్చి
     నన్ను నాన్న గా మార్చే నా నువ్వు....
యాడనున్నావో...ఏం చేస్తున్నావో..

కలలో కవిత్వంమా...విచిత్రం

ఏంటో ఈ పిచ్చి కలలకి అంతెప్పుడో..అవి నిజాలుగా మారేదెప్పుడో...
   నువ్వు నిద్ర లేచినప్పుడు.
నాన్న
   ఆ నాన్ననే రా....కుంభకర్ణుడి సహోదరా...
అదేవిటి నాన్న!
   అదేవిటా!...ఇది నీకెన్నో పెళ్ళి చూపులురా..?
లెక్కెట్ట లేదు నాన్న
   నువ్వెందుకు లెక్కెటతావ్ నాన్న...లెకెట్టవ్...ఒరేయ్ ఇప్పటికి ఈ సంవత్సర కాలంలో  పెళ్ళి వారికి తొంభై ఎనిమిది సార్లు క్షమాపణ కోరుతూ ఉత్తరం వేశాను.కాబట్టి ఇది తొంభై తొమ్మిదోది.ఏదో నీ కాబోయే మామ గారు నా పాత స్నేహితుడు కాబట్టి సరిపోయింది.లేకపోతే నీకెవ్వర్రా పిల్లనిచ్చేది.ఐనా నీకిదేం జబ్బు రా సరిగ్గా చూపుల రోజే సుప్తావస్తలోకి జారుకుంటావ్.పీనుగులదగ్గిర విలపించినట్లు విలపించినా, సంవత్సర కాలంగా పళ్ళకేసి చూడని అష్ట దరిద్రులతో,అక్కుపక్షులతో లాఫింగ్ తెరపి తెరిపించినా, ప్రపంచంలో వినదగినవి,వినకూడని రకరకాల శబ్దాలను ప్రయొగించిన మెసుల్తావ్ కాని లెగవ్..చివరికి చేసేదేం లేక ప్రక్క ఊళ్ళో ఆడాళ్ళు బిందెలతో ఎంటపడ్డా ట్యాంకర్ నీళ్ళు తెచ్చాను కద రా...
 సారీ నాన్న...ఇప్పుడు చూడు చిటికెలో రెడి అవుతా..
ఛాలెంజ్ వద్దులేరా నాన్న...చిటికేసే ధైర్యం కూడా సన్నగిల్లంది..తొందరగా రెడీ అయ్యి వచ్చెయ్..వెళ్దాం..సరేనా.?.
ఒ.కె..డాడీ...
సార్..పోస్ట్...పోస్ట్...
వస్తున్నా!..వస్తున్నా!..
తండ్రి ఉత్తరం విప్పి చూచాడు.చదివాడు.అంతే ఉత్తరం బయట పారెసి గదిలోకెళ్ళి గడియ పెట్టుకున్నాడు.కొడుకు రెడి అయ్యి వచ్చాడు.
నాన్న త్వరగా రా..ట్రైన్ టైం అవుతుంది
గది లో నుండి తండ్రి అంటున్నాడు.బాబూ కుమార రత్నం అక్కడున్న ఉత్తరం చదువు నాన్న.
ఉత్తరమా అని వెదికాడు.త్వరగానే దొరికింది.అది విప్పి చదివాడు.వీడు కూడా దాన్ని అక్కడ పారేసి వాడి గదిలోకి పోయి తలుపేసుకున్నాడు..
నేలమీద ఉత్తరం పడి  ఉంది.గాలికి రెప రెపలాడుతుంది.ఆ ఉత్తరం లో ఇలా రాసుంది.

ప్రియమైన రామాచారికి

      నీ ప్రాణమిత్రుడు రంగాచారి రాయునది.ఇక్కడ అంతా క్షేమం.అక్కడ నువ్వూ,పిలగాడు క్షేమమని తలుస్తాం.చెప్పొచ్చేదేంటంటే నువ్వు రాసిన తొంభైం ఎనిమిది ఉత్తరాలతో మా అమ్మాయి జాతకమే మారిపోయింది రా అంట్ల వెదవ!.అయినా ఫేస్బుక్,వాట్సాప్ ల కాలంలో ఈ ఉత్తరాలతో రాయబారమేంటి రా సన్నాసి పీనుగ!.నీ రాయబారాలు అందివ్వడానికి వచ్చన ఆ పోస్ట్ మాన్   ముండాకొడుకు ఉత్తరానికో ప్రేమలేఖని జతచేసినట్టున్నాడు.ఆ రోజు నుండి వింత వంతగా ప్రవర్తించేది.నన్ను అమ్మ అనీ,వాళ్ళ అమ్మ ను నాన్న అని పిలిచి సచ్చేది.ఓ రోజు  ఉన్నట్టండి  నా బట్ట తల కి జడ వేస్తాని ఎంట పడితే పక్కూరికెళ్ళి తలదాచుకున్నా.నిజానికి నీ రెండో ఉత్తరానికే దీనికి, వాడికి  మనసులు కలిసాయంది.పైత్యం అని ఊరుకున్నా.కాని దీని చేష్టలు మూలంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తందేమొనని భయపడి.ఒప్పేసుకున్నా.నీ ముప్పై రెండో ఉత్తరానికనుకుంటా,మా కుటుంబానికి అతగాడి కుటుంబానికి మాటలు కలిసాయి.యెంటనే పప్పన్నం తినేసాం.ఆతర్వాత బాజాలు కూడా మోగాయి.ఈ విషయాలన్నీ చెప్తూ నీకు రెండు మూడుసార్లు ఉత్తరాలేసా అయినా నీపాటికి నువ్వు ఉత్తరాలేస్తూనే ఉన్నావ్.బహుశా అవి చేరుండవ్. మొన్ననే నా మనవడి బారసాల జరిగింది.ఆ రోజే నువ్వు పంపిన తొంభై ఎనిమిదో ఉత్తరం చదివి తెగ నవ్వుకున్నాం..అవిరా సన్నాసి విశేషాలు.వీలు చూసుకొని నా మనవడిని చూడటానికి రండి.ఇంకో విషయం రో.మళ్ళీ ఇట్టాంటి ఉత్తరాలు ఎవరికీ పంపమాక..జీవితాలు తారుమారవుతున్నాయ్
ఉంటా మరి..

20/1/16

NARESH GANTALA

No comments:

Post a Comment