Wednesday, 28 October 2015

                                                 ఎవరికేం తెలుసు!

 ఎన్నోఏళ్ళుగా పంజరంలోనే బ్రతుకుతున్న చిలుక,ఆ పంజరం  కిటికీ తలుపులు తెరిచినా పారిపోకుండా అక్కడే తచ్చట్లాడుతుంది. ఆ చిన్ని పంజరమే దానికి ఓ పెద్ద ప్రపంచం. ఆ ప్రపంచాన్ని వదులుకోవాలనుకోదు, కొత్త ప్రపంచం కోసం ఆశ పడదు కాని విధి ఈ వింత మాయా ప్రపంచంలోకి పడేస్తే....!
            సిటీలోనే అది పెద్ద ఆసుపత్రి. హాస్పిటల్ అంతటా హడావుడిగా వుంది. స్టాఫ్ అందరూ సివిల్ డ్రెస్స్లల్లో అదరగొడుతున్నారు. కుర్ర డాక్టర్లు కొంతమంది వస్తున్న అతిధులను ఆహ్వానిస్తున్నారు. మరికొంతమంది వారికి ఫలహారాలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. హాస్పిటల్ ఎంట్రన్స్ లో పచ్చి పూలతో అందంగా అలంకరించి, ఓ చిన్న వేదికను ఏర్పాటు చేశారు. సిటీలో మిగతా హాస్పిటల్స్ కి చెందిన గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ వచ్చారు. ప్రింట్ మీడియా,మరియు ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చింది. ఆరోగ్యశాఖా మంత్రి కూడా హాజరవుతుండటంతో ఈ కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. హడావుడిగా ఈ ఫంక్షన్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియకపోవడంతో ఎవరికి తోచినట్లు వాళ్ళు ఊహిస్తున్నారు.
               కార్యక్రమం మరో పది నిమిషాలలో మొదలవుతుందనగా మంత్రి కూడా వచ్చారు.హడావుడి తగ్గింది.మాటలు ఆగాయి.కార్యక్రమం మొదలయ్యింది.హాస్పిటల్ డైరెక్టరే ఓ ఫైల్ చేతపుచ్చుకొని సరాసరి వేదిక పైకి చేరుకున్నాడు.ఆపాటికే ప్రింట్ మీడియా వారు తమ నోట్ పాడ్స్ తో సిద్దంగా ఉన్నారు,ఎలక్ట్రానిక్ మీడియా వారు తమ కెమెరా కళ్ళను ట్రైపాడ్స్ పై గుండా ఎక్కు పెట్టారు.ఆసుపత్రిలోని రోగుల తాలూకు బంధువులు కూడా ఒక్కొక్కరిగా వేదిక ను చేరుకున్నారు.అందరూ ఏం చెప్తారోనని ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
               డైరెక్టర్ తన ప్రసంగం మొదలుపెట్టాడు" నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు వచ్చిన మీ అందికీ చాలా ధ్యాంక్స్.ఈ రోజు మిమ్మల్ని పిలిచిన కారణం మీకు ఓ వ్యక్తిని పరిచయం చేయాలని. నిజానికి ఇరవైరెండేళ్ళుగా తను మా పేషెంట్. మా హాస్పిటల్ లోనే తనకి ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాం. బతకడు అనుకున్న అతను కోలుకున్నాడు . మామూలు మనిషయ్యాడు.అతన్ని పరిచయం చేయటానికే ఈ అత్యవసర మీటింగ్. వచ్చిన అతిధులలో నిరుత్సాహం మొదలయ్యింది. ఏముందని ఇందులో.. మా పనులన్నీ చెడగొట్టుకొని మరీ వచ్చింది ఇందుకోసమా అంటూ గుసగుసలు ప్రారంభమయ్యాయి.
                డైరెక్టర్ తన ప్రసంగాన్ని కొనసాగించాడు "శారీరకంగా తన వయస్సు నలభై ఒకటి,కాని మానసికంగా తను పదిహేడు దగ్గర ఆగిపోయాడు. అంటే నా ఉద్దేశం గడిచిన ఇరవైనాలుగేళ్ళు అతను మన లాగా చూడలేదు,వినలేదు,మాట్లడలేదు,మరియు తినలేదు.సింపుల్ గా చెప్పాలంటే అతను జీవించలేదు,కాని బ్రతికే ఉన్నాడు".
                వచ్చిన అతిధులు,మీడియా వారు సగం అర్ధమై,సగం అర్ధం కాక ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటున్నారు.డైరెక్టర్ ఇక అసలు విషయానికి వచ్చాడు" ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అతను ఇరవై నాలుగేళ్ళుగా కోమాలోనే ఉన్నాడు".అందరూ ఆ మాట విని ఆశ్చర్యపోయారు.కొంతమందికి నమ్మకం కలగలేదు.మరికొంతమంది ఇదోరకం పబ్లసిటిగా భావించారు.ఓ జర్నలిస్టు "అసలు ఇది ఎలా సాధ్యం,ఓ మనిషి కోమాలో ఉండి అన్నేళ్ళు బ్రతుకుతాడా " అని ప్రశ్నని సంధించాడు.డైరెక్టర్ బదులిస్తూ" అభివృధ్ది చెందిన మెడికల్ టెక్నాలజితో ఇది సాధ్యమే.ఆల్రెడీ అమెరికా దేశంలో 2003 లోనే ఇలాంటి కేసు ఒకటి బయటపడంది.అతను పందొమ్మిదేళ్ళ తర్వాత కోమాలో నుండి బయటపడ్డాడు.ఆ కేసుకి,ఈ కేసుకి చాలా దగ్గర పోలికలున్నాయి.ఇద్దరికి మెదడుకి సంభందించిన సెర్బ్రల్ కార్టెక్స్ డామేజ్ అయ్యింది.అయితే అతనికి వాళ్ళ కుటుంబం తోడుగా వుంది.కాని ఇతనికి తోడుగా ఉండటానికి కుటుంబమే లేకుండా పోయింది.కారణం,91 లో జరిగిన కారు ప్రమాదంలో ఇతని కుటుంబం మొత్తం మరణించింది.కాని ఇతను మాత్రం బ్రతికిపోయాడు.ఆ రోజు మొదలుకొని నిన్నటి వరకు హి ఈజ్ ఇన్ కోమా.నౌ వియ్ ఆర్ ప్రసెంటింగ్ అవర్ పేషెంట్" అంటూ ప్రధాన ద్వారం కేసి తిరిగాడు.వచ్చిన ఆతిదులు కూడా తమ తలలు అటు తిప్పారు.కూడి ఉన్న ప్రతి ఒక్కరు అతని రాక కోసం చూడసాగారు.మీడియా వారు తమ కళ్ళతోనే కాకుండా కెమేరా కళ్ళతో కూడా చూడసాగారు
                      -----------------------
               అతను వడి వడి గా నడుస్తున్నాడు.అప్పుడే పుట్టిన పసి పాప వలె చుట్టూరా అశ్చర్యంతో చూస్తూ నడుస్తున్నాడు.మీదకొస్తున్న వాహనాలను చూచి దడుచుకుంటూ,క్రింద పడుతూ,మళ్ళీ పైకి లేస్తూ నడుస్తున్నాడు.మనిషికి మనిషే శత్రవు అన్న ననుడి నిజం చేస్తూ ,వారం రోజుల క్రిందట మీడియా లో మారుమ్రోగిన వ్యక్తి ఈ రోజున రోడ్డున పడ్డాడు.గుబురుగా పెరిగిన గడ్డం ,మాసిన పైజమాలాల్చి,దుమ్ము కొట్టుకున్న పాదరక్షలుతో వికృతంగా కనిపిస్తున్నాడు.అతనికి పరిచయం ఉన్న ప్రపంచం,ఇప్పుడు అతని కళ్ళ ముందు ఉన్న ప్రపంచం వేరుగా ఉండేసరికి చెప్పలేనంత ఆశ్చర్యానికి గురవుతున్నాడు.రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవంతులు చాలా పెద్దవిగా,కనిపిస్తున్న వాహనాలు చాలా వింతగా అనిపిస్తున్నాయి.ప్రతి భవంతి దగ్గర ఆగుతున్నాడు.కాసేపు విచిత్రంగా చూస్తున్నాడు.మళ్ళీ నడుస్తున్నాడు.అలాగే రోడ్డు పై నడిచే ప్రతి వాహనాన్నీ వదలట్లేదు.ఇలా చూచే క్రమంలో బంతి వలె గిరగిరా తన చుట్టూ తాను తిరుగుతున్నాడు.అలా తిరిగి తిరిగి ఏ దిక్కున ఆగుతాడో తనకే తెలియదు.ఆగిన దిక్కు కేసి మారుప్రయాణం కడుతున్నాడు.
                 ఆకాశాన సూరీడు నడినెత్తి మీదకి చేరటానికి ప్రయత్నిస్తున్నాడు.  హలో.... హలో.. ..తప్పుకో..నిన్నే..ఓయ్...రేయ్....పాపం ఆమె తప్పించుకోలేక పోయింది.రోడ్డుపై బొక్క బోర్లా పడింది,బండి ఆమె పై పడింది.అతను మాత్రం కొంచెం ఆవల వెల్లకిలా పడ్డాడు.హాయిగా ఆకాశాన్ని చూస్తూ,నీలో మాత్రం  ఎటువంటి మార్పు కనిపించటం లేదు అనుకున్నాడు.అదే రంగు,అదే ప్రశాంతత.ఇంతలో ప్రక్క నుండి ఏవో అరుపులు వినిపించటంతో అటు గా చూశాడు.
                ఆశ్చర్యం..ఇదేంటి,ఇప్పుడు ఆడ,మగ తో పాటు ఓ క్రొత్త ప్రాణి సంచరిస్తుందే.ఈ ఇరవై నాలుగేళ్ళలో మనిషి సృష్టంచిన అధ్భుతమేమో అనుకుంటూ ఆమెను పై నుంచి క్రింద దాకా పరికించి చూచాడు.కళ్ళకి నల్లని రంగు,పెదాలకు ఎర్రని రంగు,పొడవైన కేశాలు,ఎతైన ఛాతి,ఓళ్ళు కనబడేలా చేతులులేని తెలుపు రంగు టీషర్ట్,గాలి కూడా చచ్చేట్టు కాళ్ళకి అత్తుకున్న నలుపు రంగు ప్యాంటు,మరో మూడు అంగుళాలు ఎత్తు పెంచిన పాదరక్షలు,మచ్చుకైనా ఆమె నోటి వెంట వినపడని తెలుగు భాష.ఎవరు సాయం చేసారో ఏమో,ఆమె బండి స్టాండ్ వేసి నుంచోబెట్టబడివుంది.ఆమె కూడా నుంచొని వంటికి పట్టిన దుమ్ము దులుపుకుంటూ వికృతంగా మొహం పెట్టి తెగ తిడుతుంది.అతను మాత్రం అలాగే వెల్లకిలా పడుకుని ఆమెనే చూస్తూ ఉన్నాడు.ఎవరూ అతనిని లేపటానికి ప్రయత్నించలేదు.అతను కూడా ఎవరికోసం ఎదురు చూడలేదు.లేచాడు.దులుపుకున్నాడు.చూచాడు.అతనికి ఆమె తప్ప ఇంకెవ్వరూ కనిపించటం లేదు.
                  నాకొక సందేహం...మీరు ఆడ,మగ,లేక...ఏమీ లేదు మీలో ఆ రెండు లక్షణాలు కనపడుతుంటేనూ..అని అడిగేశాడు.ఊహించని ఆ ప్రశ్నకి తను ఖంగుతిన్నది.సెకన్ల కాలంలోనే తను మహంకాళిగా మారిపోయింది.వేగంగా తన చేయి ఆతని చెంపని తాకింది.ఆ దెబ్బకి ఆక్కడ గుమికుడి ఉన్న నలుగురైదుగురు కూడా ఇప్పుడు అతనికి కనబడుతున్నారు.ఆమె మాత్రం ఒకచేత్తో కాలర్ పట్టుకొని,మరో చేత్తో చెంపలు వాయిస్తూనే ఉంది.అప్పుడు ఆ గుంపులో ఉన్న ఒకడు వచ్చి ఆపాడు కాబట్టి సరిపోయింది.బ్రతికి బయటపడ్డాడు.అందరూ కలసి ఆమెను అక్కడి నుండి పంపించారు.తసు చేసిన తప్పేంటో తనకి ఇంకా  అర్దం కాలేదు.ఇంతలో అతన్ని రక్షించిన వ్యక్తి దగ్గరగా వచ్చాడు.
                  చూడటానికి అమాయకుడిలా ఉన్నావు.ఎలా బ్రతుకుతావో ఏంటో.ఇదిగో ఈ డబ్బులు ఉంచు అంటూ జేబులో పెట్టబోయాడు.అతను వద్దని వారించాడు.ఇవి నీవే ఇందాక క్రింద పడినప్పుడు పడిపోయినవి అని సర్దిచెప్పి పది రూపాయలు జేబులో పెట్టి వెళ్ళిపోయాడు.ఆసుపత్రిలో కాంపౌండర్ లాంటి మంచివాళ్ళు బయట కూడా ఉన్నారనుకున్నాడు.ఆసుపత్రి యాజమాన్యం ఉట్టి చేతులతో పొమ్మన్నా,ఆ కాంపౌండర్ మాత్రం జేబులో ఓ పచ్చ నోటు పెట్టి పొమ్మన్నాడు.ఆలోచనలని కట్టిపెట్టి తన గమ్యం లేని ప్రయాణాన్ని మరలా పునఃప్రారంభించాడు.
                 అలా వెళ్తూవుండగా ఓ యువకుడు పలక లాంటి వస్తువుని ఒొక చేత్తో పట్టుకొని, మరో చేతి వ్రేళ్ళతో దాని మీద నొక్కుతూ,చెవిలో చెవిటిమిషన్ లాంటిదేదో పెట్టుకొని ఊగుతూ, నవ్వుకుంటూ పైకి చూడకుండా స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్ళి కరెంటు పోలుకి తగిలి దభేలున క్రింద పడ్డాడు.ఎంతైతే వేగంగా క్రింద పడ్డాడో అంతే వేగంగా లేచి మరల ఆ పలక లోకి చూస్తూ నవ్వుకుంటూ అంతే వేగంగా వెళ్ళిపోయాడు.తన నడకను ఆపి ఇదంతా గమనించిన ఆతను ,"ఈ ప్రపంచం మనుషుల్ని చిన్న వయస్సు లోనే పిచ్చోళ్ళని చేస్తుంది అనుకుంట" అంటూ తన ప్రయాణాన్ని కొణసాగించాడు.దారిలో ఇతనికి అలాంటి పిచ్చోళ్ళు వీధికొకళ్ళు కనబడ్డారు.నవ్వుకుంటూ ముందుకు సాగాడు.
                   సూరీడు నడి నెత్తి కి చేరుకున్నాడు.కడుపులో ఏదో అర్దం కాని బాధ మొదలయింది.ఏం చేయాలో తెలియలేదు.ఏదైనా తింటే బాగుండనిపిస్తుంది.వెంటనే కాంపౌండర్ ఇచ్చిన పచ్చ నోటు గుర్తొచ్చింది.దారిలో ఉన్న ఆపిల్ పండ్ల బండి దగ్గర ఆగాడు.కాంపౌడర్ ఇచ్చిన పచ్చ నోటు కోసం జేబులో వెతికాడు.కాని లాభం లేదు.ఎంత వెతికినా పది రూపాయల నోటు తప్ప ఆ పెద్ద నోటు కనపడలేదు.ఆలోచించగా ఆ నోటు ఏమైందో అర్దమయింది.నిజానికి కాంపౌండర్ తప్ప తనకి ఎవరూ డబ్బు ఇవ్వలేదు.ఆసుపత్రి నుంచి వచ్చేప్పుడు  ఆ పెద్ద పచ్చ నోటు తప్ప తన దగ్గర ఏ నోటు లేదు.మరి ఈ పది రూపాయల నోటు ఎలా వచ్చింది.నీదే ఈ నోటు అంటూ ఆప్యాయత నటించి నా జేబులో పెట్టిన ఆ వ్యక్తే నా అసలు నోటు ని మాయం చేసుంటాడని తెలుసుకొని చాలా బాధ పడ్డాడు.మెత్తని కత్తుల వలె ఉన్న ఈ మనుషుల పట్ల,ఈ సమాజం పట్ల అతనికి ఏహ్య భావం కలిగింది.
ఏం పిచ్చోడా ఏం కావాలి.?
    నేను పిచ్చోడిని అయుతే మీరంతా ఎవర్రా ఆని మనుసులో అనుకున్నాడు.
నిన్నే ఏం కావాలి.తప్పుకో నవ్వుంటే నా బండి దగ్గరకి ఎవ్వరూ రారు.వెళ్ళిపో..
    జేబులో ఉన్న పది రూపాయల నోటు తీసాడు.దాని మీద ఉన్న గాంధీ గారి బొమ్మని చూచి నీది ఒక్కడిదే ఇక్కడ కల్మషం లేని చిరు నవ్వు అనుకుంటా.ఓ ఆపిల్ పండు ఇవ్వండి అంటూ డబ్బు ఇచ్చాడు.అతను పండు కావాలని అడిగిన విధానం,డబ్బు ఇవ్వడం చూచి పండ్ల వ్యాపారి తను తొందరపడ్డాడని తెలుసుకున్నాడు.ఓ వ్యక్తి మీద ఇంత తొందరగా ఓ అభిప్రాయానికి ఎలా వస్తారండి అని వ్యాపారితో అన్నాడు.నవ్వుకుంటూ,పండు తీసుకొని అక్కడ నుండి నిష్క్రమించాడు.పండ్ల వ్యపారి తల దించుకున్నాడు.
       జరిగిన రెండు మూడు సంఘటనలు తన మనస్సుని బగా కలిచివేశాయి.క్షణం కూడా ఇక్కడ ఉండబుద్ది కావడం లేదు.దేవుడా వీలైతే నన్ను నా ప్రపంచానికి నెట్టెయ్ అని ప్రార్దించాడు.
       సాయంత్రం అయ్యింది.రోజు మొత్తం ఇలాంటి వింతలు విశేషాలు ఎన్నో చూచాడు.అలసిపోయాడు. రోడ్డు కి ప్రక్కగా ఉన్న బస్ స్టాప్ కి చేరాడు.అక్కడ ఉన్న బెంచ్ పై కూర్చొన్నాడు.ఇతని ప్రక్కన ఖాళీగా ఉన్నా కూర్చోటానికి ఎవరూ ఇష్టపడటం లేదు.వచ్చిన ప్రతి ఒక్కరూ ఇతనికేసి అసహ్యంగా చూచి ప్రక్కకు తప్పుకుంటున్నారు.ఈ సంఘటనతో తను పూర్తిగా కలత చెందాడు.దేవుడు ఎలాగో తనకు సాయం చేయడని తలిచాడు.అందుకే తనే స్వయంగా తనకి నచ్చిన ప్రపంచాన్ని సృష్టంచుకున్నాడు.ఎవరికీ కనపడనీ,తనకి మాత్రమే కనిపించే ఓ స్నేహితుడిని సృష్టించాడు.తన ప్రక్కనే కూర్చోపెట్టుకున్నాడు.తనతో సంభాషించటం మొదలెట్టాడు.నవ్వుతున్నాడు.అప్పుడప్పుడు  ఆశ్చర్యపోతున్నాడు.సలహాలిస్తున్నాడు.ఏదేదో చేస్తున్నాడు.ఆఫీస్ల నుండి వచ్చే ఉద్యోగులు,పాఠశాలల నుండి వచ్చే పిల్లలు అక్కడ ఆగి మరీ ఇతన్ని చూస్తున్నారు.బోర్ కొట్టి కొందరు,సీరియల్ టైమై కొందరు,ఇంట్లో పెళ్ళాలు గుర్తొచ్చి మరి కొందరు వెళ్ళిపోయారు.కాని అతను మాత్రం అక్కడ నుండి కదలలేదు.మాట్లాడుతూనే ఉన్నాడు.ఇన్నేళ్ళుగా మాట్లాడలేని ఎన్నో విషయాలు తన స్నేహితుడితో పంచుకుంటూనే ఉన్నాడు.అటుగా వచ్చిన ప్రతి ఒక్కరూ పాపం పిచ్చోడిలా ఉన్నాడని అనుకుంటూనే ఉన్నారు.చూస్తుండగానే పగలు రాత్రి గా మారింది.సూరీడు,చంద్రుడుగా మారాడు.వీధి దిపాలు దగ దగా వెలుగుతున్నాయి.రోడ్డు మీద వాహనాలు కూడా అప్పుడొకటి అప్పుడొకటి మాత్రమే వెళ్తున్నాయి.జనాలు కాడా తగ్గుముఖం పట్టారు.అతను మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు.మాట్లాడుతూనే ఉన్నాడు.
   తెల్లారింది.మరలా జీవనచక్రం ఆరంభమయింది.ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు,స్కూళ్ళకి వెళ్ళే విద్యార్దులతో రోడ్లన్నీ బిజిగా మారుతున్నాయి.వ్యాపారులు అప్పుడే దకాణాలు తెరచి, దుమ్ము దులిపి,వస్తువులను సర్దుతున్నారు.నిన్న అతన్ని చూసిన ఒకరిద్దరు అతన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేశారు.కాని ఎవరికేం తెలుసు...ఆకాశంలోని ఆ సూరీడు నగరాన్ని చూడకముందే, శవంగా మారిన అతన్ని మున్సిపాలిటీవోళ్ళు ఎత్తేసారని...ఎవరికేం తెలుసు....ఏ పిచ్చోడి వెనుక ఏ కధ ఉందో...!


WRITTEN BY
NARESH GANTALA
   




   
       

1 comment: